>>
..:: సర్వభూజనులారా , యోహోవాను బట్టి ఉత్సహించుడి , ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి - కీర్తన 98:4 ::..
 పేతురు గురించి క్లుప్తంగా..

👉 పేతురు తండ్రి పేరు యోహాను.
👉 కాని వాస్తవానికి అతని పేరు "యోనా" అని అంటారు.
👉నజరేతు పట్టణానికి 25 మైళ్ళ దూరంలో తూర్పున వున్న బెత్సయిదా పట్టణంలో పుట్టాడు.
👉 ఈ పట్టణం గలిలయ సాగరానికి ఉత్తర తీరాన ఉన్నది. చేపలు పట్టే వృత్తిని బట్టి యోహానును "యోనా" అని అంటారు.
👉ఆంద్రెయ యొక్క సహోదరుడు. (యోహాను 1:40,42)

పేతురు బెత్సయిదాలో పుట్టినప్పటికి (యోహాను 1:44) కపెర్నహూములో (లూకా 4:31, 38) కాపురముంటూ చేపలు పట్టి జీవించేవాడు.

పేతురు క్రీస్తు వైపుకు ఆకర్షింపబడింది అతని సహోదరుడైన ఆంద్రెయ వల్లనే.

👉గలిలయలో చేపలు పట్టుకుంటున్న సమయంలో ఆంద్రెయ పేతురుతో - తాను మెస్సియాను చూసినట్టు చెప్తాడు.
ఆ మాట విన్నంతనే పేతురు వలను విడిచిపెట్టి, భార్యను, కుటుంబాన్ని త్యజించి ప్రభువు చెంతకు పరుగెత్తాడు.

పేతురును మొదటి సారిగా యేసు ప్రభువు కలుసుకున్నప్పుడు అతన్ని చూసి యిలా అన్నాడు -

 "నీవు యోహాను కుమారుడైన సీమోనువు. నీవు కేఫా అనబడుదువు. కేఫా అను మాటకు రాయి అని అర్థము." (యోహాను 1:42)

🔹అట్టి పేతురు గృహం యేసు ప్రభువు యొక్క సందర్శనకు పాత్రమైంది.
కపెర్నహూముకు ప్రభువు ఎప్పుడు విచ్చేసినా పేతురు గృహానికే వచ్చేవాడు. ఈ గృహంలోనే పేతురు అత్తగారిని, అనేకమంది రోగులను స్వస్థపరచినాడు.

🔹పండ్రెండుగురు అపోస్తలుల ఎన్నిక తర్వాత ఇక్కడికే వచ్చాడు. యిచ్చటే ఆయన అమూల్యమైన బోధనలను శిష్యులకు అందించాడు. యిచ్చటికే ఆయన తల్లి సోదరులు వచ్చినారు.

ఈ శిథిల గృహంపైనే పేతురును పిమ్మట ఆయన జ్ఞాపకార్థం కాంస్టాంటైను చక్రవర్తి అనుమతితో 352 తర్వాత బ్రహ్మాండమైన చర్చి నిర్మించబడింది.

🔸పేతురు మాటలకన్నా చేతల్లో ముందుకురికే వ్యక్తి,
🔸 స్వీయ ప్రతిభ కలవాడు.
🔸 తొలి దినాలలో అపోస్తలులకు ఆదర్శంగా మొదటి శ్రేణిలో నిలిచిన వ్యక్తి. పేతురును ఈ విషయంలో అధిగమించినవాడు పౌలు ఒక్కడే.

👉పేతురులో ధైర్యము, పిరికి రెండు వున్నాయి. ప్రభువు పట్టుబడిన రాత్రి ప్రభువు యెడల అతని వైఖరే యిందుకు నిదర్శనం.
అయితే
🔹అతన్ని క్రీస్తు క్రమశిక్షణాపరునిగా,
🔹 విశ్వాసిగా,
🔹దీక్షాపరునిగా తీర్చి దిద్దాడు.

క్రీస్తు శిష్యులందరికన్నా మిన్నగా పేతురుతోనే మాట్లాడేవాడు.
👉 నిందించినా, శ్లాఘించినా పేతురుపైనే ప్రభువుకు ఆ వాత్సల్యమున్నది.

 క్రీస్తు ఆరోహణ అనంతరం పెంతెకోస్తు పండుగ దినం నాటికి పేతురు పరిపూర్ణ విశ్వాసిగా నిలవడానికి కారణం - క్రీస్తుతో అతనికున్న సాన్నిహిత్యమే.

పేతురు తన తప్పును తాను తెలుసుకోగల సున్నిత మనస్తత్వం గలవాడు. పాపం చేసినప్పుడు స్వచ్చందంగా ఆ పాపమును అంగీకరించేవాడు.

"ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడను." (లూక 5:87) అని చెప్పిన ఉదాహరణలున్నవి.

🔺అపోస్తలుల కార్యముల గ్రంథమును పరిశీలిస్తే ప్రారంభ దినాలలో జెరుసలేము చర్చికి పేతురు అధిక ప్రాధాన్యతను యివ్వడమే గాక యూదుల పరిధి నుండి అన్యజనుల వరకు క్రైస్తవ్యాన్ని తీసుకుపోడానికి చేసిన అద్భుత కృషి కనిపిస్తుంది.

అపోస్తలుల కార్యముల గ్రంథమును రెండుగా విభజిస్తే
 🔹మొదటి విభజనలో పేతురు,
🔹 రెండవ విభజనలో పౌలు కార్యములే మనకు కనబడతాయి.

🔹పెంతెకోస్తు పండుగ దినాన పేతురు ప్రసంగములు,
🔹పుట్టి కుంటివానిని స్వస్థత పరచడం లాంటి అద్భుత కార్యములకు ప్రజలంతా అతన్ని వెంబడించేవారు. అందుచేతనే పౌలు మహాశయుడు గలతీ 2:9 లో పేతురు చర్చికి మూలస్తంభముగా ప్రకటించినాడు.

🔹పేతురు సువార్త దండయాత్రలో అనేకులను డీకొని జయించినాడు.
🔹మంత్ర తంత్రాలకు - దేవుని మహిమకూ పరీక్ష సమయం వచ్చినప్పుడు ఇంద్రజాలికుడు అయిన సీమోనును ఓడించినాడు.
దేవుని సేవలో సమరయ పరిశుద్ద స్థానమును పొందుటకు పండ్రెడుగురు అపోస్తలులచే ప్రతినిధిగా పంపబడినాడు.
🔹 కైసరియ మొదలగు పలు ప్రాంతాలలో సువార్త వ్యాప్తికి విస్తారంగా కృషి చేసినాడు.
 కొరింథు చర్చి కార్యక్రమాలలో పేతురుకు పౌలుతో సమానంగా ప్రమేయమున్నది.

చరిత్రకారుడు యుసిబియస్
🔸 పేతురుకు లిధూనియా,
🔸 గలతియా మొదలైన తూర్పు దేశ ప్రాంతములంతటా సంబంధములున్నట్లు చెప్పినాడు.
🔸బబులోనుకు కూడా వెళ్లి సువార్తను ప్రబోధించినట్టు పరిశుద్ద గ్రంధమే సాక్ష్యమిస్తుంది.

👉 భార్యతో కలిసి చిన్న ఆసియాలో సువార్త ప్రకటించుట..... 1 కొరింథీ 9:5

అంతియొకయ చర్చిని స్థిరపరచి, దాదాపు 7 సంవత్సరములు - రోము నగరానికి వెళ్ళుటకు ముందు సువార్త సేవ చేసినవాడు పేతురు.

రోము నగరములో తనకు సిలువ మరణము సంభవించక ముందు బ్రిటనుకు ఫ్రాన్సు దేశంలోని గాళ్ పట్టణానికి వెళ్లినట్టు ఆధారాలు వున్నాయి.
ఆయన జ్ఞాపక చిహ్నంగా బ్రిటనులో మొదటి చర్చిని 153లో బ్రిటిష్ చక్రవర్తి లూషీ నిర్మించినాడు.
👉 క్రైస్తవ్యాన్ని జాతీయ విశ్వాసంగా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేసినాడు.

క్రీస్తు ఆరోహణ అనంతరం క్రైస్తవులపై యూదులు సాగించిన హింసాకాండకు పేతురు గురైనాడు.
🔹 ముళ్ళ కొరడాలచే కొట్టబడినాడు. ప్రభువు కొరకు వాటిని ఆనందంగా భరించినాడు.
🔹హేరోదు అగ్రిప్ప యాకోబును వధించిన తర్వాత పేతురును కూడా బంధించి చెరసాలకు పంపించాడు.
కానీ ఆ రాత్రి ప్రభువు దూత ఆయనను తాకగా సంకెళ్ళు తెగిపడినవి. చెరసాల తలుపులు తెరచుకున్నవి. పేతురు అక్కడి నుండి వెళ్లిపోయినాడు.

పిమ్మట అనేక అద్భుత క్రియలను చేస్తూ పేతురు రోము నగరానికి వచ్చాడు. అప్పుడు పౌలు యిచటనే ఉన్నాడు. 64 లో నీరో చక్రవర్తి రోము నగరాన్ని దహనం చేయించి, ఆ అగ్ని జ్వాలలను చూస్తూ ఆనందిస్తూ, ఈ దహనానికి కారణం క్రైస్తవులే అని నిందించి, వారిని మారణ హోమం చేయడానికిని ఉత్తర్వులు యిచ్చాడు.

నీరో చక్రవర్తికి ప్రియమైన "మగూ" అనే మాంత్రికుడు ఉండేవాడు. యితడు ఆ రోజులలో అద్భుతమైన గారడీ చేస్తున్నాడు. గాలిలో ఎగురుట ఆ గారడీలో ఒక భాగం. ఆ గారడీ చూడటానికి వేలాది మంది ప్రజలు వచ్చారు. వారిలో పేతురు, పౌలు కూడా ఉన్నారు. మగూ గారడీ చేస్తున్న సమయంలో పేతురు, పౌలులు మోకాళ్ళూని ఆ గారడీ వాన్ని  అరికట్టించమని యేసు ప్రభువును ప్రార్ధించారు. వెంటనే మగూ నేలపై పడ్డాడు. కాళ్ళు విరిగినవి.

అంతేగాక రోమను సైన్యాధిపతులను, రక్షక భటులను 49 మందిని క్రైస్తవులుగా పౌలు, పేతురులు మార్చివేసారని నీరో చక్రవర్తి ఉగ్రుడై వారిని బంధించమని ఆజ్ఞాపించినాడు.

ఆ చెరసాలలో పేతురు అనుభవించిన దుర్భర వేదనను ప్రముఖ చరిత్రకారుడు  జోయట్ యిలా విశ్లేషించినాడు -

"రాజధానికి దిగువ భాగంలో ఏక్ శిలలో దొలచబడ్డ రెండు గదులున్నవి. దీనిని 'మామర్టయన్' అని అంటారు. ఈ రెండింటిలో ఒకటి ఉరి గది. కన్నులు పొడుచుకున్న కాననంతటి కటిక చీకటి. యిచటే రోమను ప్రభువులు తమ శత్రువులను వేసి నరక యాతనకు గురి చేసేవారు. ప్రపంచంలో ఎవరూ సాగించనంత హింసాకాండను సాగించేవారు. ఈ కటిన యమ కూపంలోనే పేతురు తొమ్మిది (9) నెలలు గడిపాడు.

చేతులకు నిలువు సంకెళ్ళు వేయబడి నేలపై పరుండడానికి కూడా అవకాశమీయలేదు. యిట్టి దుర్భర స్థితిలో ప్రభువు నామాన్నే స్తుతిస్తూ ధైర్యంతో ఉన్నాడు. అట్టి కటిన కారాగారం నుండి బయటకు తీసి రోమను హంతకులు పేతురును సిలువ వేసారు. సిలువ వేసినప్పుడు పేతురు - తనను ప్రభువువలె సిలువ వేయుటకు అంగీకరించలేదు. అతడి కోరికపై పేతురును తలక్రిందులుగా సిలువ వేసినారు."

👉ఆ విధంగా పేతురు క్రీస్తు కొరకు ప్రకాశించి రోము నగరంలో అస్తమించినాడు. వాటికన్ సింహాసనం అతడి అస్థికలపైనే ఏర్పడిందంటే అతిశయోక్తి కాదు.

"పండ్రెడుగురు" అనే తన గ్రంధంలో ఎడ్గార్ జె. గుడ్ స్పీడు పేతురు యొక్క చివరి దినాలలో జరిగిన మరో విషాదాంత ఘటనను యుసిబియస్ మాటల్లో యిలా చెప్పాడు -

పేతురు మరణ శిక్షకు గురై కొనిపోతున్న సమయంలో తన భార్యకు వీడ్కోలు చెబుతూ "ప్రభువును స్మరించుకో" అని అన్నాడు.

ఈ విధంగా అపోస్తలుడైన పేతురు ప్రభువు సేవకు అంకితమై రోము నగరంలో హతసాక్షి అయ్యాడు.

♻ పేతురు గురించిన కొన్ని విషయాలు - వాటి రెఫరెన్సులు

పేతురు యొక్క కుటుంబము, వృత్తి
 : యోహాను 1:40,42, 44 ; లూకా 4:31, 38 ; మత్తయి 8:14,18

పేతురు అపోస్తలుడగుట : యోహాను 1:10-42 ; లూక 5:5-11

పేతురు యొక్క విశ్వాసము పరీక్షింపబడుట :

1) నీళ్ళ మీద నడచుట ............. మత్తయి 14:22--33

2) ప్రభువు రావలసిన మెస్సియా (క్రీస్తు) అని నమ్మి హత్తుకొని యుండుట........ మత్తయి 16:13-20 ; యోహాను 6:66-69

3) ప్రభువు శ్రమ పొందకూడదని తలంచుట ............. మత్తయి 16:21-23

పేతురు యొక్క ప్రశ్నలు :

1) పన్ను చెల్లించుట గూర్చి ...........    మత్తయి 17:24-27

2) తప్పు చేసిన వానిని క్షమించుటను గూర్చి ..... మత్తయి 18:21-22

3) ప్రభువును వెంబడించిన శిష్యులకు కలుగు ఫలమును గూర్చి .... మత్తయి 19:27-30

4) యోహాను యొక్క రాబోవు స్థితిని గూర్చి....... యోహాను 21:23

పేతురు మూడు ప్రాముఖ్యమైన స్థలములలో ప్రభువుతో నుండుట :

1) యాయీరు గృహమునందు...... లూకా 8:49-56

2) రూపాంతర కొండ (హెర్మోను) ..... మత్తయి 17:1-8 ; లూకా 9:30-32

3) గెత్సేమనే తోట ..................... మార్కు 14:32-33 ; మత్తయి 26:40-46 ; యోహాను 18:10-15

ప్రభువుతో చివరి పస్కాను ఆచరించుట :
 లూకా 22:7-13 ; యోహాను 13:7-24

పేతురు ముమ్మారు బొంకుట :
 లూకా 22:24-34 ; యోహాను 13:31-38 ; మత్తయి 26:30-35

పేతురు ప్రభువును యెరుగనని బొంకినందుకు పశ్చాతాప పడుట :
 యోహాను 18:15-17 ; మార్కు 14:66-72 ; యోహాను 18:25-27 ; లూకా 22:60-62

పునరుత్తానుడైన ప్రభువును చూచుట :

1) ప్రభువు యొక్క సమాధి తెరువబడి యున్నదని, మగ్దలేనే మరియచే వినుట.... యోహాను 20:1-4

2) యోహానుతో పాటు పరుగెత్తి సమాధిని చూడటానికి వెళ్ళుట..... యోహాను 20:3

3) ధైర్యముతో సమాధిలో ప్రవేశించుట........... యోహాను 20:4-7

4) సందేహముతో కడమ శిష్యుల యొద్దకు వెళ్ళుట...... యోహాను 20:9-10

5) ప్రత్యేకముగా ప్రభువును చూచుట..... లూకా 24:34

6) గలిలయ సముద్ర తీరమున క్రీస్తును చూచి పరీక్షింపబడుట..... యోహాను 21:1-18

7) ఆరోహణ సమయంలో ఒలీవ కొండపై చూచుట ..... అపో.కా. 1:4-11

మేడ గది, పెంతెకోస్తు అనుభవము  ....
  అపో.కా. 1:12-2:41

పేతురు చేసిన అద్భుతములు :

1) పుట్టు కుంటి వానిని బాగు చేయుట....... అపో. కా. 3:1-26

2) చనిపోవునట్లు అననీయ, సప్పీరాలను శపించుట...... అపో. కా. 4:32-5:11

3) పక్షవాయువు గల ఐనెయను స్వస్థత పరచుట....... అపో. కా. 9:32-35

4) చనిపోయిన దొర్కాను బ్రతికించుట..... అపో. కా. 9:36-42

పేతురు పొందిన శ్రమలు :

1) చెర నుండి గద్దింపబడుట....... అపో. కా.  4:1-31

2) చెరలో ఉంచబడి కొట్టబడుట ..... అపో. కా. 5:15-42

3) చెరనుండి మరణము నుండి దూతచే రక్షింప బడుట..... అపో. కా. 12:1-19

పేతురు సువార్త ప్రకటించుట :

1) సమరయలో సువార్త ప్రకటించుట....... అపో. కా. 8:14-25

2) కైసరయలో మొదట బాప్తిస్మమిచ్చుట..... అపో. కా. 10:1-11:18;  1 కొరింథీ 9:5 ; గలతీ 2:9

3) సున్నతి విషయమై తన అభిప్రాయములను చెప్పుట..... అపో. కా. 14:25-15:21

4) పౌలుచే అంతియొకయలో గద్దింప బడుట....... గలతీ 2:12,14, 15-21

 పేతురు తన మనవి చొప్పున తల క్రిందులుగా సిలువ మరణము పొందుట.

 ప్రపంచంలో ఎవరూ పొందనంత హింసాకాండను పేతురు అనుభవించాడు.  కటినాతి కటినమైన యమ కూపంలోనే పేతురు తొమ్మిది (9) నెలలు గడిపాడు. చేతులకు నిలువు సంకెళ్ళు వేయబడి నేలపై పరుండడానికి కూడా అవకాశం లేని దుర్భర స్థితిలో వుండి కూడా ప్రభువు నామాన్నే స్తుతిస్తూ ధైర్యంతో ఉన్నాడు. అట్టి కటిన కారాగారం నుండి బయటకు తీసి రోమను హంతకులు పేతురును సిలువ వేసారు. సిలువ వేసినప్పుడు పేతురు - తనను ప్రభువువలె సిలువ వేయుటకు అంగీకరించలేదు. అతడి కోరికపై పేతురును తలక్రిందులుగా సిలువ వేసినారు.

(పేతురు మరణం గూర్చి ముందుగానే చెప్పబడిన వాక్యభాగం ... యోహాను 21:18-19)

"నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు." దానియేలు 12:3.

హల్లెలూయ...

మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.

ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!



 

0 comments

Post a Comment

Total Pageviews

Email Subscriptions

Enter your email address:

Delivered by FeedBurner

Chrstian Lybrary APK Downlad

Chrstian Lybrary APK Downlad
Mobile APK Downlad Telugu E-Books Telugu Bible study Telugu Christian Songs Lyrics Telugu Christian Messages Telugu Christian Songs Mp3 TELUGU CHRISTIAN VIDEO SONG Bible pdf Bible Quotes, Bible study Bible Verses Christmas Wallpaper English Bible .Pdf English Bible mobile jar files Free Jesus Christ wallpapers Jesus Christ pictures